Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
డ్రీమ్ ట్రీ
Talent:
ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామం మధ్యలో పాతిపెట్టిన బండరాళ్ల వీధులు, ఇరువైపులా పచ్చని పొలాలు. గాలి మధురంగా వీస్తూ, పక్షులు గానం చేస్తూ, అక్కడ ఒక అందమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ గ్రామంలో రమణ అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను చాలా చలాకీ, ఆడుకోవడమే ఇష్టం. చదువులో అంత ఆసక్తి లేకపోయినా, స్నేహితులతో గడిపేయడమే ఇష్టం. ఒక రోజు రమణ తండ్రి అతనికి ఒక చిన్న చెట్టు మొక్క ఇచ్చి... “రమణా, ఇది నీ భవిష్యత్తు. నాటుకుని, జాగ్రత్తగా పెంచు” అన్నాడు. రమణ మొదట ఆనందపడ్డాడు. “వావ్! నాకు కూడా ఒక చెట్టు ఉంటుంది. నేను కాస్త నీళ్లు పోస్తే చాలు కదా!” అని నాన్నతో ఉత్సాహంగా చెప్పాడు. అతను ఆ మొక్కను ఇంటి ముందున్న మట్టి తోటలో నాటేశాడు. రెండు రోజులపాటు బాగా చూసుకున్నాడు. కానీ మూడో రోజు నుంచే, స్నేహితులతో ఆడుకోవడంలో మునిగిపోయి ఆ మొక్కను మర్చిపోయాడు. మొక్కకు నీరు అందక ఆకులు వాడిపోయాయి. ఒక రోజు రమణ గమనించి తండ్రిని అడిగాడు: “నాన్నా, ఈ మొక్క ఎందుకు వంగిపోయింది?” అని! తండ్రి చిరునవ్వుతో అన్నాడు: “నువ్వు దాన్ని చూసుకోకపోతే, అది బలంగా ఎలా పెరుగుతుంది? జీవితం కూడా అలాగే రా! జాగ్రత్త, క్రమశిక్షణ లేకపోతే, ఏ పనీ పెరగదు.” నాన్న గారి మాటలకు రమణ కొంచెం సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే మారలేదు. కొన్ని రోజుల తర్వాత, స్నేహితులతో ఆడుకుంటూ రమణ ఒక చిన్న చెట్టును కొమ్మలు విరిచాడు. అప్పుడు స్నేహితులు చప్పట్లతో నవ్వారు. రమణ కూడా నవ్వేశాడు. కానీ అక్కడ గమనిస్తున్న ఒక ముసలయ్య దగ్గరకు వచ్చి గట్టిగా అన్నాడు: “రాముడా! నువ్వు ఒక కొమ్మ విరిచావు. అది నీకు ఆటలా అనిపించింది. కానీ ఆ చెట్టుకి అది నొప్పి. నువ్వు ఆ మొక్కలా ఒకడు అని ఊహించు… ఎవరో నీ చేయి విరిస్తే ఎలా ఉంటుంది?” అని చెప్పి కోపం గా వెళ్లి పోయాడు. రమణ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఆ రాత్రి రమణకు ఒక కల వచ్చింది. కలలో ఆ మొక్కలన్నీ మానవ రూపంలో అతని దగ్గరకు వచ్చాయి. రమణ తో ఒక చెట్టు చెబుతోంది: “రమణా, మేము నీకు నీడ ఇస్తాం, ఆక్సిజన్ ఇస్తాం, పండ్లు ఇస్తాం. కానీ నువ్వు మమ్మల్ని చూసుకోకపోతే, మేమెలా బ్రతుకుతాం?” అన్నది. ఇంకో చెట్టు: “మనుషులు మమ్మల్ని నాశనం చేస్తే, రేపు వారికి పీల్చడానికి గాలి, నీడ, తినడానికి పండ్లు ఏమీ ఉండవు.” రమణ భయంతో లేచిపోయాడు. అతనికి అర్థమైంది – మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అని! ఆ రోజునుంచి రమణ తన మొక్కను ప్రతిరోజూ నీరు పోశాడు. ఆకులు వాడిపోతే శుభ్రం చేశాడు. కొత్త మొక్కలు నాటి, వాటిని కాపాడే పనిలో పడిపోయాడు. అతని స్నేహితులు మొదట నవ్వారు: “ఏంటి రా, నువ్వు ఇప్పుడు తోటమాలి అయ్యావా?” అని హేళన చేశారు. కానీ... కొద్ది నెలలకే ఆ చిన్న మొక్కలు పెద్ద చెట్లుగా మారి పచ్చగా పెరగడం చూసి… అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సాయంత్రం తండ్రి, రమణ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “చూడరా రమణా… ఈ చెట్లు నీకు ప్రతిరోజూ ఏదోకరకంగా ఉపయోగపడుతున్నాయి.. నువ్వు వాటిని ఎలా కాపాడుతున్నావో, అవి కూడా నీ భవిష్యత్తును అలాగే కాపాడతాయి. నీకు సంతోషంగా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఒక మొక్కను నాటు” అని చెప్పి కొడుకును మెచ్చుకొని వెళ్ళాడు. రమణ హృదయం నిండిపోయింది. “ప్రకృతిని కాపాడటం మన అందరి బాధ్యత. మనం ఒక చెట్టును నాటితే, అది మనకే కాదు, మన తరువాతి తరాలకు కూడా వరం అవుతుంది. అందుకే… మొక్కను నాటి కాపాడటం, జీవాన్ని కాపాడటమే.” ప్రకృతిని గౌరవించు. చెట్లను కాపాడు. జీవితం అందంగా మారుతుంది. ఇక కథ కంచికి మనం ఇంటికి.
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Story
Hyderabad
Need help